YSRCP: వైసీపీపై నిప్పులు చెరిగిన రఘువీరారెడ్డి!

  • ‘కాంగ్రెస్’పై జగన్ పార్టీ తప్పుడు ప్రచారం తగదు
  • జగన్ మీడియా కట్టుకథలు అల్లుతోంది
  • వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పడ్డ పార్టీ వైసీపీ

కాంగ్రెస్ పార్టీపై ఒక పథకం ప్రకారం జగన్ పార్టీ, ఆయన మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. జగన్ మీడియా కట్టుకథలు అల్లి ‘కాంగ్రెస్’ శ్రేణుల్లో గందరగోళం, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే జగన్ పార్టీ బలహీనపడి కనుమరుగవుతుందనే భయంతోనే ఇలాంటి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు హర్షం చేస్తుంటే.. జగన్, ఆయన మీడియా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని విభజన చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని ఇంతకాలం జగన్ చెప్పారని, ఇప్పుడేమో ఈ అంశాన్ని విభజన చట్టంలో పెట్టకపోవడం వల్లే దానిని బీజేపీ అమలు చేయడం లేదని తన పత్రిక ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. బీజేపీ వాదనకు అండగా నిలుస్తున్న జగన్, ఆ పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ద్వారానే రాష్ట్రానికి హోదా, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలన్నీ అమలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీలో తీర్మానం చేసిందని, అత్యున్నత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ నిర్ణయం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ‘కాంగ్రెస్’ పేరును, నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను తమ పార్టీ చేసినట్టుగా జగన్ చెప్పుకోవడం ఆ పార్టీ దివాళా కోరుతనాన్ని తెలియజేస్తోందని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

అధికారమే పరమావధిగా, వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పడిన జగన్ పార్టీకి ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఎలాంటి సిద్ధాంతాలు, విధానాలు లేవని జగన్ రాజకీయ కార్యాచరణ తెలియజేస్తోందని విమర్శించారు. జగన్ పార్టీ ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా మారారని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. కేవలం కొద్దిమంది రాజకీయ కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే జగన్ పార్టీ పుట్టి పని చేస్తోందని, ఈ నేపథ్యంలో ప్రజలను భావోద్వేగాలకు గురిచేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తోందని రఘువీరారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News