Uttam Kumar Reddy: ‘ముందస్తు’కు ఉత్తమ్ 'సై' అంటాడు..శశిధర్ రెడ్డి 'నై' అంటాడు!: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని ‘కాంగ్రెస్’ చూస్తోంది
  • 70 లక్షల ఓట్లను తొలగించారన్నది అబద్ధం
  • ప్రజల్లో ఇలాంటి అపోహలు సృష్టించొద్దు

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ ‘సై’ అంటుంటే, శశిధర్ రెడ్డి మాత్రం 'నై' అంటున్నాడని ఆ పార్టీ నేతలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్.. ప్రజా సమస్యలపై పోరాడుతుందని ప్రజలు భావించారని, కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతే.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తే తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరగకూడదని, రాష్ట్రం ఎండిపోవాలనే దుర్మార్గమైన ఆలోచనలు ప్రతిపక్షాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో డెబ్బై లక్షల ఓట్లను తొలగించారన్న ఆరోపణలు సబబు కాదని, ప్రజల్లో ఇలాంటి అపోహలు సృష్టించవద్దని అన్నారు. ఓటర్ల జాబితా నుంచి కొన్ని పేర్లు తొలగిస్తే తొలగించి ఉండొచ్చని..ఆయా పేర్లను ఎన్నికల కమిషన్ ఎందుకు తొలగించిందో చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదని అన్నారు.

More Telugu News