Nellore District: తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేసిన ఉన్నతోద్యోగి... అరెస్ట్!

  • నెల్లూరు జిల్లా తడలో ఘటన
  • బ్యాంకులో రూ.కోటి తస్కరించిన డిప్యూటీ మేనేజర్
  • కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు

గొప్పవాడిని కావాలన్న కోరిక.. రాత్రికిరాత్రి పెద్ద వ్యాపారవేత్త అయిపోవాలన్న ఆశ అడ్డదారిలో పయనింపజేసి.. ఓ యువకుడి జీవితాన్ని నాశనం చేశాయి. ఎంబీఏ చదువుకుని పెద్ద బ్యాంకులో ఉన్నతస్థాయి అధికారిగా ఉన్న అతను తన హోదాను అడ్డుపెట్టుకుని భారీ దొంగతనానికి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పవన్‌కుమార్‌ డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అయితే సొంత వ్యాపారం చేసుకోవాలని అనుకున్న పవన్ వక్రమార్గం పట్టాడు. బ్యాంకు నుంచి నగదును కొట్టేసి ఎటైనా వెళ్లిపోయి వ్యాపారం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఈ నెల 16న రాత్రి 7.30 గంటల సమయంలో బ్యాంకుకు వెళ్లి సెక్యూరిటీ గార్డు రాజ్‌ కిషోర్‌ను బ్యాంకు తెరవాలని సూచించాడు. అనంతరం బ్యాంక్ లోపల స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లి బ్యాగులో రూ.కోటి నగదును తీసుకున్నాడు.

సాధారణంగా స్ట్రాంగ్ రూమ్ ను తెరవాలంటే ఇద్దరు డిప్యూటీ మేనేజర్ల దగ్గరున్న తాళాలు కావాలి. ఇది ముందుగానే తెలిసిన పవన్, రెండో తాళాన్ని తెలివిగా తస్కరించి పని కానిచ్చాడు. ఆ తర్వాత అక్క ఇంటికి వెళ్లి రూ.10 లక్షలు ఇచ్చాడు. అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పరారయ్యాడు. తమ్ముడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె పెద్దలతో కలసి ఈ నెల 18న పోలీసులకు ఆ రూ.10 లక్షలను అందజేసింది.

అప్పటికే బ్యాంకు అధికారుల ఫిర్యాదును అందుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కావలి మండలం రుద్రకోట గ్రామ సమీపంలో హైవేపై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పవన్ నుంచి రూ.89.91 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో యాక్సిస్ బ్యాంకుతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గూడూరు శాఖలో పవన్ పనిచేశాడని పోలీసులు తెలిపారు.

అన్నిచోట్లా గొడవలు పడటంతో తడకు ట్రాన్స్ ఫర్ అయ్యాడని వెల్లడించారు. ఇక్కడి క్యాషియర్ ట్రైనింగ్ కు వెళ్లడంతో ఆ బాధ్యతలు కూడా పవన్ చూసేవాడనీ, ఈ నేపథ్యంలో భారీగా నగదును చూసి కొట్టేయాలని ప్లాన్ చేసి ఉంటాడని వ్యాఖ్యానించారు.

More Telugu News