Tamilnadu: ప్రముఖులకు చికిత్స అందించే గదుల్లో సీసీ కెమెరాలు ఉంచం: అపోలో

  • జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌కు స్పష్టీకరణ
  • ఆనాటి సీసీ టీవీ పుటేజీ ఏదీ అందుబాటులో లేదని వివరణ
  • ఆస్పత్రి వర్గాలు ఈనెల 11న పంపిన వివరాలు తాజాగా వెలుగులోకి

‘ప్రముఖులకు చికిత్స అందించే గదుల్లో మేము ఎటువంటి సీసీ కెమెరాలు ఉంచం. అందువల్ల తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలితకు చికిత్స అందించిన నాటి సీసీ టీవీ పుటేజీ ఏదీ మా వద్ద అందుబాటులో లేదు’..అని చెన్నైలోని అపోలో ఆసుపత్రి యాజమాన్యం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసిన యాజమాన్యం దాన్నే పునరుద్ఘాటించింది.

 జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌కు ఈ నెల 11వ తేదీన అపోలో ఆసుపత్రి ఈ మేరకు వివరణ ఇచ్చింది. తాజాగా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయే ముందు జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలోని బెడ్‌పై కూర్చున్న ఆమె పండ్ల రసం తాగుతూ టీవీ చూస్తున్నట్లున్న ఓ వీడియోను ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన వెట్రివేల్‌ విడుదల చేశారు. అప్పట్లో ఈ వీడియో సంచలనం సృష్టించింది. అయితే ఇది గ్రాఫిక్‌ చేసిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఆ వీడియోను కమిషన్‌కు అప్పగించాలని జస్టిస్‌ ఆర్ముగస్వామి ఆదేశించారు. చికిత్స నాటి సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని ఆస్పత్రి యాజమాన్యానికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందిస్తూ అపోలో ఈ విధంగా వివరణ ఇచ్చింది.

More Telugu News