RTC: మేల్కొన్న ఆర్టీసీ.. కొండగట్టుకు రెండు మినీ బస్సులు!

  • ఉదయం 6 నుంచి సాయంత్రం 5.30 గంటలవరకూ సర్వీసులు
  • కలెక్టర్ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభం
  • మరో రెండు బస్సులను నడుపుతామన్న ఆర్టీసీ

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బస్సు ఫిట్ నెస్ లేకపోవడం, ఓవర్ లోడ్ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ప్రత్యేకంగా రెండు మినీ బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

ఈ రోజు నుంచి రెండు మినీ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. కొండగట్టు గుట్ట నుంచి జేఎన్ టీయూ, పిల్లలమర్రి, దిగువ కొండగట్టు వరకూ ఈ మినీ బస్సు సర్వీసులు నడుపుతామని వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం 11 ట్రిప్పుల చొప్పున ఈ బస్సులు తిరగనున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి మరో రెండు బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.ఈ బస్సులను జిల్లా కలెక్టర్ శరత్ ప్రారంభించనున్నారు. కాగా, ఘాట్ రోడ్డుపైకి సొంత వాహనదారులను అనుమతించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

More Telugu News