Woman: రెండేళ్లుగా సోదరిని చిత్ర హింసలు పెట్టిన సోదరుడు.. నాలుగు రోజులకోసారి ఆహారంగా రొట్టెముక్క!

  • దిగజారుతున్న మానవ సంబంధాలు
  • సోదరిని రెండేళ్లుగా బంధించిన అన్న
  • నీళ్లు, ఆహారం లేక విలవిల్లాడిన బాధితురాలు

మానవ సంబంధాలు ఎంతగా దిగజారుతున్నాయో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. తన సోదరిని బంధించిన ఓ అన్న ఆమెకు ఆహారంగా నాలుగు రోజులకోసారి ఓ బ్రెడ్ ముక్కను అందించేవాడు. సోదరుడి చేతిలో రెండేళ్లుగా చిత్రహింసలకు గురవుతున్న ఆమెను మహిళా కమిషన్ సభ్యులు, పోలీసులు రక్షించారు. టెర్రస్ పైన మలమూత్రాల మధ్య పడి ఉన్న 50 ఏళ్ల మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన అందరి మనసులను తొలిచేస్తోంది.

 ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మాలివల్ మాట్లాడుతూ... బాధితురాలి వయసు 50 ఏళ్లని, అయితే, గత రెండేళ్లుగా సరైన తిండి లేక చిత్రహింసలకు గురవుతుండడంతో ఆమె 90 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆమె శరీరం ఎముకలకు అంటుకుపోయి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల వారు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేయకపోవడం బాధాకరమన్నారు.  

బాధితురాలి రెండో సోదరుడు డీసీడబ్ల్యూకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న బాధితురాలు తన తల్లితో కలిసి ఉండేది. తల్లి చనిపోయిన తర్వాత ఆమె బాధ్యతలను తీసుకున్న సోదరుడు చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. తన సోదరుడు ఆమెను రెండేళ్లుగా హింసిస్తున్నాడని, ఆమెను చూసేందుకు కూడా ఎవరినీ అనుమతించడం లేదని మరో సోదరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బాధితురాలిని రక్షించేందుకు బుధవారం డీసీడబ్ల్యూ బృందం  ఆమె ఇంటికి వెళ్లింది. అయితే, ఆమె సోదరుడి భార్య తలుపులు తెరిచేందుకు నిరాకరించింది. అధికారులను తిట్టిపోసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ గేట్లు తీయకపోవడంతో పక్కనే ఉన్న భవనం పై నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టెర్రస్‌పై పడి ఉన్న మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

More Telugu News