High Court: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!

  • సంధ్యారాణి సహా ఆరుగురు దాఖలు చేసిన పిల్ పై విచారణ
  • లైంగిక వేధింపుల నివారణకు తీసుకున్న చర్యలేంటి?
  • ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో స్పందించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సామాజిక ఉద్యమకారిణి సంధ్యారాణి, మరో ఆరుగురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై, విచారణ చేపట్టిన సీజే తొట్టత్తిల్ బీ రాధాకృష్ణన్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ ల ధర్మాసనం స్పందించింది.

మహిళా కళాకారులపై లైంగిక వేధింపులు, వాటి నివారణకు సంబంధించి చట్టంలో చేసిన మార్పుల గురించి, వాటి అమలు తీరుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, కార్మిక శాఖ కమిషనర్, డీజీపీలను ఫిర్యాదిదారులు ప్రతివాదులుగా పేర్కొన్నారు.

పిటిషన్ల తరఫున న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ, తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఓ కళాకారిణి రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతివాదులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నోటీసుల జారీ అనంతరం, విచారణను వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది.

More Telugu News