Rahul Gandhi: ఆంధ్రుల కళ్లలోకి చూసే ధైర్యం కూడా మోదీకి లేదు: రాహుల్ గాంధీ

  • తప్పుడు హామీలిచ్చి మోదీ అధికారంలోకి వచ్చారు
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే
  • ఏపీని మోదీ పూర్తిగా మోసం చేశారు

పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలన్నింటినీ ప్రధాని మోదీ తుంగలో తొక్కారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శిచారు. 2014 ఎన్నికలప్పుడు మోదీ ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మోదీలా తప్పుడు హామీలు ఇవ్వడం తనకు అలవాటు లేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. తొలి సంతకాన్ని ప్రత్యేక హోదా ఫైల్ పైనే చేస్తామని చెప్పారు. ప్రధానిగా కాకుండా దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన మోదీ... మాట తప్పారని విమర్శించారు. కర్నూలులో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్ ప్రసంగిస్తూ ఈమేరకు విమర్శలు గుప్పించారు. రాహుల్ ఇంగ్లీషులో మాట్లాడగా... ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని... ఐదేళ్లు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టిందని... ఇప్పుడు నాలుగేళ్లు గడుస్తున్నా ఏపీకి బీజేపీ చేసిందేమీ లేదని రాహుల్ మండిపడ్డారు. ఏపీ కోసం విభజన చట్టంలో కాంగ్రెస్ ఎన్నో అంశాలను చేర్చిందని... కానీ, ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా మోదీ ఏపీని పూర్తిగా మోసం చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రుల కళ్లలోకి చూసే ధైర్యం కూడా మోదీకి లేదని ఎద్దేవా చేశారు. 

More Telugu News