Jagan: అత్యధిక సంపాదన ఉన్న ఎమ్మెల్యేల్లో టాప్-5లో జగన్... టాప్ 20లోని తెలుగు ఎమ్మెల్యేల వివరాలివి!

  • జగన్ వ్యక్తిగత ఆదాయం రూ. 13.32 కోట్లు
  • ఆయన తరువాత మర్రి జనార్దన్, జీవీ ఆంజనేయులు
  • వెల్లడించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్

ఇండియాలోని ఎమ్మెల్యేలందరిలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో వైకాపా అధినేత వైఎస్ జగన్ 5వ స్థానంలో ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సంపాదిస్తున్నది జగనే. ఆయన వ్యక్తిగత ఆదాయం రూ. 13.32 కోట్లు కాగా, కుటుంబ ఆదాయం రూ. 18.13 కోట్లని ఏడీఆర్ వెల్లడించింది.

ఆయన తరువాతి స్థానంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్, రూ. 9.21 కోట్ల వ్యక్తిగత, రూ. 10.76 కోట్ల కుటుంబ ఆదాయంతో 8వ స్థానంలో ఉన్నారు. ఆపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ. 8.49 కోట్ల వ్యక్తిగత, రూ. 8.61 కోట్ల కుటుంబ ఆదాయంతో 10వ స్థానంలో, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రూ. 6.48 కోట్ల వ్యక్తిగత ఆదాయంతో, రూ. 7.96 కోట్ల కుటుంబ ఆదాయంతో 14వ స్థానంలో ఉన్నారు. ఆపై 19వ స్థానంలో నిలిచిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రూ. 4.85 కోట్ల వ్యక్తిగత, రూ. 5.54 కోట్ల కుటుంబ ఆదాయంతో నిలిచారు.

ఇక అత్యల్ప ఆదాయం ఉన్న తెలుగు ఎమ్మెల్యేల విషయానికి వస్తే, శింగనమల ఎమ్మెల్యే బి.యామినీ బాల వ్యక్తిగత ఆదాయం 1,301 అని, కుటుంబ ఆదాయం కూడా అంతేనని ఏడీఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా దక్షిణాది ఎమ్మెల్యేలు శ్రీమంతులుగా ఉండగా, ఈశాన్య ఎమ్మెల్యేలు పేదలని ఏడీఆర్ వెల్లడించింది. గత ఎన్నికల సందర్భంగా 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ లను మధించి ఈ వివరాలు సేకరించామని పేర్కొంది. దక్షిణాదిన ఉన్న 711 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం రూ. 51.99 లక్షలని, ఈశాన్య రాష్ట్రాల్లోని 614 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం రూ. 8.53 లక్షలని తెలిపింది. ఇక 139 మంది ఎమ్మెల్యేలు ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నారని, వీరి ఆదాయం చాలా ఎక్కువని ఆసక్తికర నిజాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో 50 ఏళ్ల లోపున్న ఎమ్మెల్యేల సంఖ్య 1,402గా ఉండగా, 80 ఏళ్లలోపు 1,727 మంది, 90 ఏళ్ల వరకూ వయసున్న వారు 11 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. మొత్తం ఎమ్మెల్యేల్లో 8 శాతం మంది మాత్రమే మహిళలని పేర్కొంది.

More Telugu News