pranay: ప్రణయ్ హత్య కేసు నిందితులను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు?: కేటీఆర్ కు మంద కృష్ణ ప్రశ్న

  • నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది
  • మారుతీరావు అన్ని పార్టీలను గుప్పిట్లో పెట్టుకున్నాడు
  • హత్యకు ముందు 15 నిమిషాల పాటు డీఎస్పీతో మాట్లాడాడు

పరువు హత్యకు గురైన ప్రణయ్ గురించి ట్విట్టర్ ద్వారా ఆవేదనను వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ ద్వారా స్పందించడం కాదని... పార్టీ నుంచి నిందితులను ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన నిలదీశారు. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కేటీఆర్ అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రణయ్ కేసులోని నిందితులు తమకున్న రాజకీయ, ఆర్థిక అండదండలతో శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో, కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. అమృత తండ్రి మారుతీరావు అన్ని పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడని చెప్పారు.

అమృత, ప్రణయ్ లకు హాని ఉందని తెలిసినా... వారిని కాపాడేందుకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని మంద కృష్ణ ప్రశ్నించారు. సెటిల్మెంట్లలో మారుతీరావు సిద్ధహస్తుడనే విషయం అందరికీ తెలిసిందేనని... అధికారులు, నేతల అండ చూసుకునే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపించారు. హత్యకు ముందు డీఎస్పీతో 15 నిమిషాల సేపు మారుతీరావు మాట్లాడాడని చెప్పారు. ఈ హత్య విషయంలో కేటీఆర్ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి 24వ తేదీ వరకు గ్రామ, మండల స్థాయిలో ఉదయం నిరసనలు, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

More Telugu News