mohan lal: విలేకరిని ఫేస్‌బుక్ వేదికగా క్షమాపణ కోరిన మోహన్‌లాల్!

  • శనివారం వెల్లింగ్టన్ ద్వీపానికి వెళ్లిన మోహన్‌లాల్
  • క్రైస్తవ సన్యాసిని విషయాన్ని ప్రస్తావించిన విలేకరి
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్‌లాల్

ఆవేశంలో విలేకరుల మీద మాట జారడం.. ఆ తర్వాత సారీ చెప్పడం రాజకీయ నాయకులకు పరిపాటే. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ కూడా ఇలాగే ఫేస్‌బుక్ వేదికగా ఓ విలేకరిని క్షమాపణ కోరారు. తనను అన్నగా భావించి క్షమించమని వేడుకున్నారు.

అసలు విషయంలోకి వెళితే, శనివారం ఆయన వరద బాధితులకు సాయం చేసేందుకు కేరళలోని వెల్లింగ్టన్ ద్వీపానికి వెళ్లారు. మోహన్‌లాల్ ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఓ విలేకరి వచ్చి ఇటీవల అత్యాచారానికి గురైన క్రైస్తవ సన్యాసిని విషయమై స్పందించాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన మోహన్‌లాల్.. ‘ఇలాంటి ప్రశ్న అడగటానికి సిగ్గుగా లేదా?’ అంటూ కసురుకున్నారు. దీంతో న్యాయం కోసం పోరాడుతున్న సన్యాసిని గురించి అలా మాట్లాడటమేంటని నెటిజన్లు మోహన్‌లాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఆయన ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. ‘‘నా మాటల కారణంగా ఆ జర్నలిస్టు బాధపడి ఉంటే నన్ను క్షమించమని కోరుతున్నా. నన్ను నీ అన్నగా భావించి క్షమించు తమ్ముడు. క్రైస్తవ సన్యాసిని పట్ల జరిగింది దారుణం. నువ్వు అడిగిన ప్రశ్నలో ఎలాంటి తప్పూ లేదు. కానీ ఆ సమయంలో నేను సమాధానమిచ్చే పరిస్థితిలో లేను. నా ఆలోచన వేరే విషయాలపై ఉంది. అందుకే అలా ఆగ్రహం వ్యక్తం చేశాను’’ అని మోహన్ లాల్ పేర్కొన్నారు.  

More Telugu News