pranay: కులమతాలకు అతీతంగా పిల్లలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత పెద్దలదే!: ప్రణయ్ హత్యపై చంద్రబాబు

  • అహంభావంతో మనుషులను చంపే స్థితికి రావడం ఆందోళనకరం
  • ఇష్టం లేకపోతే, వారి మానాన వారిని వదిలేయాలి 
  • హత్య చేయించడం వల్ల ఆ అమ్మాయి తండ్రి సాధించిందేమీ లేదు

తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా పిల్లలకు పెళ్లి చేయించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని అన్నారు. అహంకారం, అహంభావంతో మనుషులను చంపే స్థితికి దిగజారడం ఆందోళనకరమైన విషయమని చెప్పారు. తాము పెళ్లికానుక పథకాన్ని తీసుకురావడం వెనకున్న ముఖ్య ఉద్దేశం కులాంతర వివాహాలను ప్రోత్సహించడమేనని అన్నారు. పెళ్లికానుక పథకంలో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు.

తక్కువ కులం ఉన్న వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో ఆమె భర్తను కన్న తండ్రే చంపించాడంటే... ఈ సమాజంలో ఎంతటి అహంకారం ఉందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. అబ్బాయి మంచివాడు అయినప్పుడు, అమ్మాయికి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని వారిద్దరూ సంతోషంగా ఉంటారని భావించినప్పుడు... తల్లిదండ్రులు వారికి పెళ్లి చేసి, ఆశీర్వదించాలని చెప్పారు. ఒకవేళ ఇష్టం లేకపోతే, వారి మానాన వారిని వదిలేయాలని... ఇలా దారుణంగా హతమార్చడం అనాగరిక చర్య అని అన్నారు. ఈ హత్య వల్ల అమ్మాయి తండ్రి సాధించింది ఏమీ లేదని అన్నారు.

More Telugu News