prabodhananda swamy: ప్రబోధానంద స్వామి అసలు పేరు పెద్దన్న చౌదరి... మరిన్ని వివరాలు ఇవిగో!

  • స్వగ్రామం అనంతపురం జిల్లా అమ్ములదిన్నె
  • ఆర్మీలో వైర్ లెస్ ఆపరేటర్ గా పని చేశారు
  • కొంతకాలం ఆర్ఎంపీ గా కూడా చేశారు
  • 1993లో చిన్నపొడమల గ్రామంలో ఆశ్రమం స్థాపన
  • త్రైత సిద్ధాంతం పేరుతో కొత్త మతం

ప్రబోధానంద స్వామి... ఏపీలో గత రెండు రోజులుగా పతాక శీర్షికలకు ఎక్కిన పేరు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమల గ్రామంలో ఈయన ఆశ్రమం ఉంది. వినాయక నిమజ్జనం సందర్భంగా స్వామి అనుచరులకు, స్థానికులకు మధ్య జరిగిన దాడిలో ఒకరు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులకు మద్దతుగా ఎంపీ దివాకర్ రెడ్డి తాడిపత్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. చివరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో కలుగజేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎవరీ ప్రబోధానంద స్వామి అనే విషయం తెలుసుకుందాం.

ప్రబోధానంద స్వామి అసలు పేరు పెద్దన్న చౌదరి. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం అమ్ములదిన్నె. ఆర్మీలో వైర్ లెస్ ఆపరేటర్ గా పని చేశారు. 1980లో ఆర్మీ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కొంత కాలం ఆర్ఎంపీగా పని చేశారు. 1980-93 మధ్య ఆయన పూర్తిగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఈ ప్రాంతంతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. అయితే ఆ సమయంలో ఆయన ఉత్తర భారతానికి వెళ్లి, బాబా అవతారం ఎత్తారు. మహారాష్ట్రలో ఓ ఆశ్రమాన్ని స్థాపించారు.

అనంతరం 1993లో చిన్నపొడమల గ్రామానికి వచ్చి, ఆశ్రమాన్ని నెలకొల్పారు. 15 ఎకరాల స్థలంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రబోధాశ్రమము, శ్రీకృష్ణ మందిరము, ఇందూ జ్ఞాన వేదికను స్థాపించారు. త్రైత సిద్ధాంతం పేరుతో కొత్త మతాన్ని స్థాపించి ప్రబోధాలను మొదలు పెట్టారు. మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని... భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానము ఒక్కటే అనేదే త్రైత సిద్ధాంతము. 2017లో ప్రబోధానంద బీజేపీలో చేరారు. 

More Telugu News