YSRCP: వంగవీటి రాధాకు వైసీపీ ముఖ్యనేతల ఫోన్.. పార్టీ మారొద్దంటూ బుజ్జగింపులు!

  • నిన్న పార్టీ సమావేశం నుంచి వెళ్లిపోయిన రాధా
  • తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచన
  • అధిష్ఠానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని బుజ్జగింపు

విజయవాడ సెంట్రల్ టికెట్ పై వైసీపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయిన వంగవీటి రాధాకు బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా స్పందించకుంటే తమ దారి తాము చూసుకుంటామని ఆయన వర్గీయుల హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ ముఖ్య నేతలు రాధాతో సంప్రదింపులు ప్రారంభించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకూ కొంత సంయమనం పాటించాలని కోరారు.

ఈ సందర్భంగా రాధా స్పందిస్తూ.. నిన్నటి సమావేశంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి గట్టి పట్టున్న విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటును తాను కోరితే.. పార్టీ నేతలేమో మచిలీపట్నం, అవనిగడ్డ, విజయవాడ ఈస్ట్ అంటూ కబుర్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ విషయమై పార్టీ నేత యలమంచిలి రవి స్పందిస్తూ.. వైఎస్ జగన్ స్పందించేవరకూ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని రాధాను కోరారు. అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలనీ, ధర్నాలు, ఆందోళనలు చేయడం వల్ల వంగవీటి రాధాకే నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

నిన్న విజయవాడలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశం నుంచి రాధా ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు 5 గంటలలోపు పార్టీ నిర్ణయాన్ని ప్రకటించకుటే తమదారి తాము చూసుకుంటామని రాధా వర్గీయులు అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రంతా రాధా తన అనుచరులతో కలసి రాజకీయ భవిష్యత్ పై మంతనాలు జరిపారు.

More Telugu News