Malya: విజయ్ మాల్యాపై చార్జిషీట్‌కు సీబీఐ సిద్ధం!

  • ప్రాథమిక దర్యాప్తు పూర్తికావడంతో నెలరోజుల్లో ప్రక్రియ
  • బ్యాంకు అధికారుల మెడకూ చుట్టుకోనున్న ఉచ్చు
  • విజయ్‌మాల్యా చెల్లించాల్సిన రుణం రూ.9 వేల కోట్ల పైనే

వివిధ బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాపై చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సీబీఐ సమాయత్తమవుతోంది. నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుందని సమాచారం. చార్జిషీట్‌లో పలువురు బ్యాంకు అధికారుల పేర్లు కూడా చేరుస్తున్నట్లు సమాచారం.

విజయ్ మాల్యా ఆధ్వర్యంలో నడిచిన (ప్రస్తుతం మూతపడింది) కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం రూ.6 వేల కోట్లు రుణాలిచ్చాయి. వడ్డీతో కలిపి ఇది 9 వేల కోట్లకు చేరింది. ఈ రుణ బకాయిలు చెల్లించకుండా మాల్యా బ్రిటన్‌కు పారిపోయాడు. దీనిపై 2016లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేయబోతోంది. తొలిదశ దర్యాప్తు పూర్తికావడంతో నెలరోజుల్లో చార్జిషీట్‌ దాఖలు కానుందని సమాచారం.

కాగా, మాల్యాకు 900 కోట్లు అప్పిచ్చిన ఐడీబీఐ బ్యాంక్‌కు సంబంధించి గతంలోనే చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ, ఇందులో బ్యాంకు అధికారుల పాత్ర ఉందని నిర్ధారించింది. తాజా చార్జిషీట్‌లో ఎస్‌బీఐతో పాటు రుణాలిచ్చిన ఇతర బ్యాంకు అధికారుల పేర్లు చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Telugu News