Ravi Shastri: ఆస్ట్రేలియా టూర్‌కు ముందే రవిశాస్త్రిని పీకిపడేయండి: చేతన్ చౌహన్

  • ఇంగ్లండ్ పర్యటనలో ఓడినప్పటికీ ఇదే అత్యుత్తమ జట్టన్న శాస్త్రి
  • మండిపడుతున్న విమర్శకులు
  • అతడిని తప్పించి తీరాల్సిందేనన్న చౌహాన్

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని తప్పించాలని డిమాండ్ చేస్తున్న వారితో మాజీ టెస్ట్ క్రికెటర్ చేతన్ చౌహాన్ జత కలిశాడు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందే అతడిని తప్పించాలని డిమాండ్ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే భారత జట్టు స్వదేశంలో విండీస్‌తో తలపడనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నప్పటికీ కోచ్ రవిశాస్త్రి తనను తాను సమర్థించుకున్నాడు. గత 15-20 ఏళ్లలో విదేశాల్లో పర్యటించిన అత్యుత్తమమైన భారత జట్టు ఇదేనని వ్యాఖ్యానించాడు. దీంతో విమర్శకులు తమ నోటికి పని చెప్పారు.  

వీలైనంత త్వరగా అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. వారితో ఇప్పుడు చేతన్ చౌహాన్ కూడా గొంతు కలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రవిని తప్పించాలన్నాడు. రవిశాస్త్రి మంచి కామెంటేటర్ అని, ఆ పని చేయడానికే అతడిని అనుమతించాలని కోరాడు. ఉత్తరప్రదేశ్ క్రీడా మంత్రి కూడా అయిన చౌహాన్.. రవిని తప్పించాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లు సరైనవేనని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు బాగానే ఆడిందన్న ఆయన టెయిలెండర్ల విషయంలో మాత్రం ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు.  ఆసియా కప్‌లో భారత జట్టు సత్తా చాటుతుందని చేతన్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.   

More Telugu News