Tamilnadu: మందు ఎఫెక్ట్.. పోలీసుల నుంచి బ్రీత్ అనలైజర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు!

  • అర్ధరాత్రి చెన్నై రోడ్లపై ఛేజింగ్
  • అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం  
  • ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

సాధారణంగా పోలీసులను చూడగానే మందుబాబులు జడుసుకుంటారు. వీలైతే అక్కడి నుంచి పారిపోవడానికి, లేదంటే బండిని రోడ్డు పక్కన పార్క్ చేసి సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్లిపోవడానికి యత్నిస్తారు. కాని తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం ఓ మందుబాబు విభిన్నంగా ప్రవర్తించాడు. తననే కాకుండా తోటి మందుబాబులను ఇబ్బంది పెడుతున్న బ్రీత్ అనలైజర్ నే ఎత్తుకెళ్లాడు. దీంతో అర్ధరాత్రి పోలీస్ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అడయార్ సమీపంలో శనివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ లగ్జరీ కారులో అక్కడికి చేరుకున్న భూషణ్.. బ్రీత్ అనలైజర్ తో పరీక్షించేందుకు యత్నిస్తుండగా మెరుపువేగంతో దాన్ని తీసుకుని పరారయ్యాడు. ఈ సమయంలో పూటుగా మందు కొట్టి ఉన్న భూషణ్ పోలీసులకు దొరక్కుండా వేగంగా కారును పోనిచ్చాడు.

సదరు యువకుడిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. దీంతో చాలాచోట్ల వాహనాల రాకపోకలను నియంత్రించిన అధికారులు అర్ధరాత్రి సమయంలో భూషణ్ కారును గుర్తించి వెంబడించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అభిరామపురం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

More Telugu News