Pakistan: కార్యాలయంలోనే కునుకు తీసిన పాకిస్థాన్ మంత్రి.. వైరల్ అవుతున్న ఫొటో!

  • ఆఫీసులో కునుకు తీసిన మంత్రి
  • ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
  • ట్విట్టర్‌లో సెటైర్లు

ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం పలు సమస్యలతో సతమతమవుతోంది. జాతీయ, అంతర్జాతీయంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ‘నయా పాకిస్థాన్’ అంటూ ఇమ్రాన్ ప్రభుత్వం ఇస్తున్న స్లోగన్ చాలామందిలో ఆశలు రేపింది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో మాత్రం ఇమ్రాన్‌కు చిక్కులు తెచ్చి పెట్టింది.

పాకిస్థాన్ మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ తన కార్యాలయంలో కునుకు తీస్తున్నట్టు ఉన్న ఆ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. గత రెండు రోజులుగా మంత్రి ఫొటో నెట్‌లో షికారు చేస్తోంది. ఇది చూసి చాలామంది నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆమెను పదవి నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక యూజర్ అయితే, నిద్ర అనేది ప్రాథమిక హక్కని ఎద్దేవా చేయగా, మరొకరు కొంతసేపు ఆఫీసులో నిద్రపోయినంత మాత్రాన ఎవరికీ నష్టం వాటిల్లే ప్రమాదం లేదని ఆమెకు మద్దతు పలికాడు. మరికొందరేమో ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోలు తీసినవారికి అక్కడే ఉన్న ముఖ్యమైన ఫైళ్ల గురించి కూడా తెలిసే ఉంటుందని పేర్కొన్నారు.  

ఇటీవలే మాజారీ ఓసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను సెక్యూరిటీ గార్డు పట్టుకోవడం వివాదమైంది. కాగా, తనపై వస్తున్న విమర్శలపై మంత్రి స్పందించారు. తన బ్యాగును సెక్యూరిటీ గార్డు పట్టుకోవడం, తాను కునుకు తీస్తున్న ఫొటోలను ట్రోల్ చేయడం ద్వారా తన విధులను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు సాగవమని, తాము కచ్చితమైన అజెండాతో ముందుకు వెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

More Telugu News