YSRCP: "రావాలి జగన్ - కావాలి జగన్" నినాదంతో ఇంటింటికీ వైకాపా!

  • నేటి నుంచి వైకాపా సరికొత్త కార్యక్రమం
  • ప్రతి ఇంటికీ వెళ్లి నవరత్నాలపై వివరించనున్న నేతలు
  • అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అడుగులు

వచ్చే సంవత్సరం జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేటి నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 'రావాలి జగన్ - కావాలి జగన్' అంటూ ఇంటింటికీ తిరిగి, జగన్ గతంలో ప్రకటించిన 'నవరత్నాలు' హామీలతో జరిగే లబ్దిని గురించి వివరించాలని నిర్ణయించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, జరిగే మేలును వైసీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రజలకు తెలియజెప్పాలని, ఇటీవలి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్, ఈ కార్యక్రమానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నాలుగైదు నెలలు అత్యంత కీలకమైనందున, ప్రతి ఒక్కరి దగ్గరికీ వెళ్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ప్రజల కష్టాలన్నీ తీరుతాయని హామీలు ఇవ్వాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

కార్యక్రమ షెడ్యూల్: జగన్ పాదయాత్ర జరగనున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా జిల్లాల్లోని 168 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి సమన్వయకర్తా, నిత్యమూ కనీసం రెండు పోలింగ్ బూత్ ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి, అక్కడి ఓటర్లతో మాట్లాడాల్సివుంటుంది. ఇలా నెలలో కనీసం 50 పోలింగ్ బూత్ ల పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లాలి. ఎక్కడైతే బూత్ కమిటీల నియామకం జరగలేదో, వాటిని వారం రోజుల్లో పూర్తి చేసి  'రావాలి జగన్ - కావాలి జగన్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ ఆదేశించారు.

More Telugu News