beer: బీరు ఇప్పటిది కాదు.. 13 వేల ఏళ్ల క్రితమే బీరును తాగారు!

  • ఇజ్రాయెల్ లోని నాటుఫయన్ గుహలో లభించిన రోళ్లను విశ్లేషించిన శాస్త్రవేత్తలు
  • బీరు తయారీకి అప్పటి మానవులు ఈ రోళ్లను వినియోగించారని వెల్లడి
  • పరిశోధనల్లో పాల్గొన్న స్టాన్ ఫోర్డ్, హైఫా యూనివర్శిటీల శాస్త్రవేత్తలు

మందు బాబులు ఎంతగానో ఆస్వాదించే బీరును 13 వేల ఏళ్ల క్రితమే ఆనాటి మానవులు వినియోగించారంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఆల్కహాల్ ఉత్పత్తికి సంబంధించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇజ్రాయెల్ లో 13 వేల ఏళ్ల నాటికి చెందిన నాటుఫయన్ గుహలో లభించిన మూడు రోళ్లను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ, ఇజ్రాయెల్ లోని హైఫా యూనివర్శిటీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. ఈ రోళ్లను బీరు తయారీకి అప్పటి మానవులు వినియోగించారని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఉత్తర చైనాలో 8 వేల ఏళ్ల క్రితమే పురాతన మానవులు బీరును ఉత్పత్తి చేశారని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భావించారు. అయితే, వీరికన్నా ఐదు వేల ఏళ్ల క్రితమే మధ్యధరా ప్రాంతంలోని ప్రజలు బీరును వినియోగించారని తాజా పరిశోధనల్లో తేలింది.

More Telugu News