mayavathi: కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో పడింది: మాయావతి

  • కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి
  • వాజ్ పేయి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నారు
  • రూపాయి విలువ, పెట్రో ధరలపై ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి

బీజేపీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరకు మాజీ ప్రధాని వాజ్ పేయి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. అభివృద్ధి కోసం ప్రజలు కన్న కలలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని చెప్పారు.

పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతుండటంపై ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని మాయావతి డిమాండ్ చేశారు. గోసంరక్షణ పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని... ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది సిగ్గు చేటని మండిపడ్డారు. డాలరుతో రూపాయి విలువ దారుణంగా పతనమవుతోందని విమర్శించారు. రాఫెల్ ఒప్పందంతో బీజేపీ తీవ్ర ఒత్తిడిలో పడిందని చెప్పారు. పొత్తులపై స్పందిస్తూ... సీట్ల పంపకాల్లో న్యాయమైన వాటా ఇస్తేనే పొత్తులుంటాయని, లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. 

More Telugu News