Tirumala: తిరుమలకు బైక్ ల అనుమతి రద్దు... దివ్య దర్శనం టోకెన్ల జారీ నిలిపివేత!

  • రేపు తిరుమలలో గరుడసేవ
  • అసంఖ్యాకంగా తరలిరానున్న భక్తజనం
  • ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ

తిరుమల గిరుల్లో కొలువైన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రేపు స్వామివారు తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమల శ్రీవారి సేవలన్నింటిలో గరుడసేవకు అత్యంత ప్రాశస్త్యం ఉందన్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది భక్తులు గరుత్మంతుడిపై వచ్చే స్వామిని తిలకించేందుకు తిరుమలకు క్యూ కడతారు. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే రూ. 300 ప్రత్యేక దర్శనాల కోటాను రద్దు చేసిన టీటీడీ, నేటి సాయంత్రం నుంచి దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనుంది. రేపటి టైమ్ స్లాట్ టోకెన్ల కోటానూ రద్దు చేశారు. ఇక వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, నేటి రాత్రి నుంచి తిరుమలకు ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని, గరుడసేవ ముగిసి, కొండపై రద్దీ తగ్గిన తరువాతనే బైకులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నామని, నేడు, రేపు రాత్రంతా బస్సులను నడిపిస్తామని తెలిపారు.

More Telugu News