Telangana: తాళిబొట్టు తీసేస్తేనే వీఆర్వో పరీక్షకు అనుమతిస్తాం.. మెదక్ జిల్లాలో అధికారుల అత్యుత్సాహం!

  • నర్సాపూర్ లో ఘటన
  • తీవ్రంగా ఇబ్బందిపడ్డ మహిళలు
  • ఆందోళన నిర్వహించిన బీజేపీ నేతలు

సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షల సందర్భంగా ఎలక్ట్రానిక్ వాచ్ లు, క్యాలిక్యులేటర్లు తీసుకురావద్దని అధికారులు చెప్పడం చూస్తుంటాం. మరికొన్ని చోట్ల ఫుల్ షర్టులు వేసుకురావద్దని ఆదేశించారని వినుంటాం. కానీ మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో వీఆర్వో పరీక్షల సందర్భంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రంతో పాటు కాలిమెట్టలు, కమ్మలు తీసివేస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

దీంతో వేరే మార్గంలేని మహిళలు తమ కుటుంబ సభ్యులకు వీటిని అప్పగించి వీఆర్వో పరీక్ష రాసేందుకు లోపలకు వెళ్లారు. మరికొందరేమో కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి పిలిపించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ నాయకులు నర్సాపూర్ ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News