Telangana: ఊడిపోయిన ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు.. తృటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం!

  • తెలంగాణలోని నాగర్ కర్నూలులో ఘటన
  • ప్రమాద సమయంలో బస్సులో 105 మంది
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు

కొండగట్టు బస్సు ప్రమాద ఘటనను మర్చిపోకముందే తెలంగాణలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు ముందు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో బస్సు నేలకు రాసుకుంటూ పక్కకు జారిపోయింది. ప్రమాద సమయంలో బస్సు ఓవర్ లోడ్ తో వెళుతోంది. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో చోటుచేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు ఈరోజు నాగర్‌కర్నూలు జిల్లాలోని వట్టెంపాడు గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ముందున్న రెండు చక్రాలు ఊడిపోయాయి. దీంతో వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బస్సు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. కాగా, ఈ ప్రమాద సమయంలో బస్సులో 105 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటనలో 15 మంది గాయపడగా, అధికారులు వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. కొండగట్టు ఘటన తర్వాత కూడా బస్సుల ఫిట్ నెస్ పై ఆర్టీసీ దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

More Telugu News