Hurricane Florence: కరోలినాలో కుమ్మేస్తున్న వర్షం.. టాపు లేపేస్తున్న గాలులు.. 'ఫ్లోరెన్స్' ధాటికి 11 మంది మృతి!

  • కరోలినాను అతలాకుతలం చేస్తున్న ఫ్లోరెన్స్ హరికేన్
  • హెలికాప్టర్లు, బోట్లతో సహాయక కార్యక్రమాలు
  • గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఫ్లోరెన్స్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఓ వైపు భారీ వర్షం, మరోవైపు బలమైన గాలులు వీస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను ధాటికి ఇప్పటి వరకు 11 మంది మరణించారు. తుపానులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటికే మెరైన్స్, కోస్టు గార్డ్, రక్షక దళాలు బరిలోకి దిగాయి. బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లు, బోట్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు ఇళ్లను అమాంతం లేపేస్తున్నాయి.

తుపాను దాటికి నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఆయా ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కరోలినాలోని చాలా ప్రాంతాల్లో 60 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మరో 45 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నార్త్ కరోలినా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద తుపాను అని అధికారులు పేర్కొన్నారు. వరద క్షణక్షణానికి పెరుగుతోందని, బయటకు వెళ్తే ప్రాణాలకే ప్రమాదమని గవర్నర్ రాయ్ కూపర్ తెలిపారు.

More Telugu News