sivaji: భద్రతా సిబ్బంది తీరుతో ఎమ్మెల్యే గౌతు శివాజీ మనస్తాపం.. సీఎం సభ నుంచి వెళ్లిపోయిన వైనం!

  • పోలీసుల తీరుపై శివాజీ అసంతృప్తి
  • మంత్రులు పిలిచినా పట్టించుకోని శాసన సభ్యుడు
  •  పోలీసులను మందలించిన సీఎం

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతుశ్యామ సుందర్ శివాజీ మనస్తాపానికి గురయ్యారు. జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది తీరుతో తీవ్ర అసంతృప్తి చెందారు. ముఖ్యమంత్రి సభలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. శనివారం మధ్యాహ్నం శ్రీకాకుళం పట్టణంలోని నాగావళి వంతెనపై జరిగిన జలసిరి కార్యక్రమం అనంతరం ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ వర్సిటీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

నాగావళి వంతెనపైకి సీఎం రాకముందే శివాజీ అక్కడకు చేరుకున్నారు. అయితే భద్రతా సిబ్బంది ఆయనను వంతెనపైకి అనుమతించలేదు. సీఎం వచ్చిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యే నొచ్చుకున్నారు. అసహనం వ్యక్తం చేస్తూనే ఎచ్చెర్లకు చేరుకున్నారు. బహిరంగ సభ వేదికపై ఆసీనులయ్యారు. అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి వేదిక వద్దకు చేరుకోలేదు. ఈలోగా వచ్చిన జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్‌ విఠల్‌రావు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు మెట్ట సుజాతలు వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో అప్పటికే వేదికపై ఉన్న శివాజీ కల్పించుకుని వారిని పంపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కూడా వారిని పంపాలని కోరారు. అయినా పోలీసులు ఖాతరు చేయలేదు. దీంతో మనస్తాపం చెందిన శివాజీ సీఎం సభాస్థలికి వచ్చే వరకు అక్కడే ఉండి ఆయన రాగానే వేదిక దిగి వెళ్లిపోయారు. శివాజీ వెంట శిరీష, విఠల్‌రావు కూడా వెళ్లిపోయారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు బుజ్జగించినా వినిపించుకోలేదు. శిరీష, విఠల్‌రావు వెనక్కి వచ్చినా శివాజీ రాలేదు. విషయం తెలిసిన సీఎం పోలీసులను మందలించారు.

More Telugu News