CBI: సీబీఐలో మోదీ శిష్యుడే మాల్యాను దేశం దాటించాడు!: కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

  • లుక్ అవుట్ నోటీసులను ఆయనే నిర్వీర్యం చేశారు
  • ఇప్పుడు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల కేసును డీల్ చేస్తున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేలాది కోట్లు కుచ్చుటోపి పెట్టిన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయేందుకు సీబీఐ ఉన్నతాధికారి ఒకరు సాయం చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీబీఐలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న గుజరాత్ కేడర్ అధికారి ఏకే శర్మ మాల్యా పారిపోవడానికి మూల కారకుడని వెల్లడించారు. మాల్యాపై జారీచేసిన లుక్ అవుట్ నోటీసులను ఈ అధికారే నిర్వీర్యం చేశాడని ఆరోపించారు.

సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మపై రాహుల్ ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు గుప్పించారు. సీబీఐలో ఉన్న శర్మ ప్రధాని నరేంద్ర మోదీ ప్రియ శిష్యుడని ఎద్దేవా చేశారు. మాల్యాను చల్లగా విదేశాలకు పంపిన సదరు అధికారే ప్రస్తుతం వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల పరారీ కేసులను డీల్ చేస్తున్నారని మరో బాంబు పేల్చారు. ఈయన దర్యాప్తు చేస్తే ఇక విచారణ అంతేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

More Telugu News