Cricket: క్రికెట్‌ అభిమానులకు ‘ఆసియా కప్‌’ పండుగ!

  • నేడు శ్రీలంక-బంగ్లాదేశ్‌ మధ్య తొలిమ్యాచ్‌
  • రోహిత్‌ సారధ్యంలో సత్తాచాటనున్న టీమిండియా
  • ఇప్పటి వరకు ఆరుసార్లు భారత్‌ విజేత

క్రికెట్‌ అభిమానులకు నేటి నుంచి మళ్లీ పండుగ. ఇంగ్లండ్‌ టూర్‌లో భారత్‌ బోల్తా పడడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన అభిమానులు అచ్చివచ్చిన ఆసియా కప్‌లో మన జట్టు సత్తా చాటుతుందని ఆశిస్తున్నారు. విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు రోహిత్‌శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈనె 28వ తేదీ వరకు జరగనున్న టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌ ఈరోజు దుబాయ్ లో శ్రీలంక-బంగ్లాదేశ్‌ మధ్య జరగనుంది.

ప్రపంచకప్‌కు మరో ఎనిమిది నెలల సమయమే ఉన్నందున ఈలోగా భారత్‌ ప్రాక్టీస్‌కు ఈ మ్యాచ్‌లు ఎంతో ఉపయుక్తమవుతాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 12 సార్లు ఆసియా కప్‌ పోటీలు జరగగా ఆరుసార్లు భారత్‌ విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు టోర్నీలోని ప్రతి జట్టుతో అన్ని జట్లు ఆడేవి. గ్రూప్‌ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ పోరులో తలపడేవి. ఈసారి పోటీల్లో మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌ నుంచి రెండు జట్లు సూపర్‌ ఫోర్‌కు వెళ్తాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. అలాగే టీ-20 ఫార్మాట్‌ను మళ్లీ వన్డే ఫార్మాట్‌కు మార్చారు.

More Telugu News