Bhutan: భార్య కాళ్లకు బురద అంటకూడదని.. భుజాలపై మోసుకెళ్లిన భూటాన్ మాజీ ప్రధాని!

  • ట్విట్టర్‌లో విపరీతంగా వైరల్ అవుతున్న ఫొటో
  • తానేమీ సర్ వాల్టర్ రెలీనీ కాదన్న మాజీ ప్రధాని
  • కామెంట్లతో హోరెత్తుతున్న ట్విట్టర్

భూటాన్ మాజీ ప్రధాని త్సెరింగ్ టోబ్‌గే ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఫొటో ఇప్పుడు ఎల్లలు దాటిపోతోంది. విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఆయన తన భార్యను భుజాలపై ఎక్కించుకుని మోసుకెళ్తున్నారు. కంగారు పడకండి.. ఆమెకేమీ కాలేదు. వారు నడుస్తూ వెళ్తున్న మార్గం బురదమయంగా ఉండడంతో భార్య కాళ్లకు మట్టి అంటకూడదని ఆయనిలా చేశారు.

ఈ ఫొటోను పోస్టు చేసిన ఆయన.. భార్య కోసం ఏమైతే చేయగలమో అది చేయాలని పేర్కొన్నారు. తానేమీ సర్ వాల్టర్ రెలీ అంత గొప్పోడిని కాదని పేర్కొన్నారు. క్వీన్ ఎలిజబెత్ 1 పాదాలకు బురద అంటకుండా వాల్టర్ రెలీ తన క్లోక్ (దుస్తులు)ను ఓ బురద గుంటపై పరిచి నడిపించారు. భూటాన్ మాజీ ప్రధాని తాజా ఫొటో కూడా దానిని ప్రతిబింబిస్తోంది.

More Telugu News