Hyderabad: ప్రేక్షకుడి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేసిన థియేటర్.. రూ.55 వేలు కట్టమన్న కోర్టు!

  • ప్రేక్షకుడి నుంచి రూ.30 పార్కింగ్ ఫీజు వసూలు
  • పార్కింగ్‌ను నియంత్రించేందుకేనన్న థియేటర్ యాజమాన్యం
  • సంతృప్తి చెందని కోర్టు.. భారీ జరిమానా

నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకుడి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేసిన థియేటర్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. పార్కింగ్ ఫీజు వసూలు చేసి ప్రేక్షకుడిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

హైదరాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ గతేడాది జూలైలో మహేశ్వరి పరమేశ్వరి థియేటర్‌లో సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. కారు పార్కింగ్ కోసం సిబ్బంది అతడి నుంచి రూ.30 వసూలు చేశారు. నిబంధనలకు ఇది విరుద్ధమని నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. వినియోగదారుల ఫోరం సదరు థియేటర్‌కు నోటీసులు పంపింది.

పార్కింగ్ ఫీజు లేకుంటే అందరూ వచ్చి ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, దానిని అరికట్టేందుకే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. థియేటర్‌లో సినిమా చూసినా, ఏదైనా కొనుగోలు చేసినా పార్కింగ్ ఫీజును తిరిగి ఇవ్వాలన్న నిబంధన ఉన్నా, విజయ్‌గోపాల్ నుంచి వసూలు చేసిన ఫీజును వెనక్కి ఇవ్వకపోవడం అక్రమమని ఫోరం పేర్కొంది. విజయ్ గోపాల్‌ను మానసిక ఒత్తిడికి గురిచేసినందుకు గాను రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై విజయ్ గోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. మిగతా థియేటర్లకు ఇదో హెచ్చరిక కావాలన్నారు.

More Telugu News