Tammineni veerabhadram: మహాకూటమి అనేది అర్థం లేని ఆలోచన: సీపీఎం నేత తమ్మినేని

  • మహాకూటమిలో చేరే ప్రసక్తే లేదన్న తమ్మినేని వీరభద్రం
  • ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేయనున్నామని వెల్లడి
  • జనసేన ప్రతినిధులతో చర్చలు జరిపామని స్పష్టం

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ సహా మిగిలిన పార్టీలన్నీ ఏకమై మహాకూటమిగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దీనిపై మాట్లాడుతూ, తాము మహాకూటమిలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో తమ్మినేని మాట్లాడుతూ మహాకూటమి అనే దాన్ని అర్థంలేని ఆలోచనగా అభివర్ణించారు.

కేసీఆర్ పాతకాలపు రాజులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీ సహా కలిసి వచ్చే పార్టీలతో బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై జనసేన ప్రతినిధులతో చర్చలు జరిపామని.. విద్య, వైద్యం అంశాలపై  అంగీకారం కుదిరిందన్నారు.

అయితే, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీతో జరిగిన చర్చల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు వ్యతిరేకంగా పనిచేయాలని తాను కోరానని.. కానీ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే విషయంలో జనసేనకు అభ్యంతరాలున్నాయేమోననే సందేహం కలుగుతోందన్నారు. ఈ విషయమై తుది చర్చలు పవన్‌తో జరపాల్సి ఉందని ఆయన తెలిపారు. జనసేన, వివిధ పార్టీలతో చర్చలు పూర్తైన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని వెల్లడించారు.

More Telugu News