shivaji: మీ జగన్ ఏమైనా మహాత్మాగాంధీనా?: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై హీరో శివాజీ ఫైర్

  • మీ వెనుక తిరగడానికి జనాలేమైనా పిచ్చోళ్లా?
  • సభల కోసం పార్టీలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి
  • చంద్రబాబు మహారాష్ట్రకు వెళ్లరాదు
  • ఏపీకి చంద్రబాబు అవసరం ఉంది

ఆపరేషన్ గరుడను 'ఆపరేషన్ పెరుగు వడ' అంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శిస్తూ, అప్పుడప్పుడు వచ్చి ఏదో మాట్లాడిపోతుంటాడని తనను ఉద్దేశించి అన్నారని... తనకేం పనీపాటా లేదా? అని సినీ శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మహాత్ముడా? రోజు రెండు లక్షల మంది ఆయన వెనక తిరగడానికి జనాలేమైనా పిచ్చోళ్లా? నాకంటే చిన్నోడు జగన్. ఆయనేమైనా గాంధీలా త్యాగాలు చేశాడా? లేక పోరాటాలు చేశాడా? ది గ్రేట్ రాజశేఖరరెడ్డి గారి కుమారుడు... అంతవరకు నేను ఒప్పుకుంటా. వైయస్ కు ఒక చరిత్ర ఉంది. జగన్ వెనుక లక్షలాది మంది తిరుగుతున్నారంటున్నారు. పనీపాటాలేకుండా లక్షలాది మంది ఎందుకు తిరుగుతారు? నేను కేవలం జగన్ ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు. అన్ని రాజకీయ పార్టీలు పెడుతున్న రాజకీయ పెట్టుబడి ఇది. సభల కోసం రాజకీయపార్టీలు లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నాయి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రజల ముందు ఏ పార్టీ అయినా ఒకటే అని శివాజీ అన్నారు. టైమ్ వచ్చినప్పుడు, ప్రజావ్యతిరేకత వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందేనని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఏం చేస్తున్నారని శివాజీ ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖలో ఉన్న జగన్... విశాఖ రైల్వే జోన్ కోసం ఏం చేయబోతున్నారో చెప్పడం లేదని... ప్రతిరోజు కులాల మీటింగ్ లు, మతాల మీటింగ్ లు పెట్టుకుంటూ రాజకీయ స్వార్థం చూసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి పట్టించుకుంటే... జగన్ ను జనాలు గెలిపిస్తారని చెప్పారు.

జనవరిలో ఏపీకి ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలరని శివాజీ ప్రశ్నించారు. తెలంగాణలో అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు కాబట్టి ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని... ఇక్కడ ముందస్తు ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెబుతారని నిలదీశారు. 'చంద్రబాబుపై కేసులు పెడతారు.. ఆయన లోపలకు వెళ్తారు... టీడీపీ ఎమ్మెల్యేలు చీలిపోతారు... ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వస్తుంది... అనంతరం ఎన్నికలు వస్తాయి' ఇదేనా మీ ఉద్దేశమని ప్రశ్నించారు. అసలైన కుట్ర ఇదేనని... ఏదో ఒక విధంగా చంద్రబాబును కూలదోసి, అధికారంలోకి రావాలనేదే కుట్ర అని చెప్పారు.

'చంద్రబాబు గారు, మీరు ఈ ఎమోషనల్ డ్రామాలో చిక్కుకోవద్దు... చట్ట ప్రకారమే మీరు ముందుకు వెళ్లండి' అంటూ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను చంద్రబాబు మహారాష్ట్రకు వెళ్లరాదని చెప్పారు. దేశంలో తనకు ఎదురు నిటబడ్డది చంద్రబాబు ఒక్కడే అని మోదీ భావిస్తున్నారని... అందుకే ఇదంతా జరుగుతోందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం ఏపీకి చాలా ఉందని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే గొప్ప అవకాశం చంద్రబాబుకు వచ్చినందుకు తెలుగువారిగా మనమంతా గర్వపడాలని... ఆయన దుర్మార్గుడైతే చట్టం ఆయనను లోపల వేస్తుందని తెలిపారు. తనను విమర్శించే అధికారం ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని చెప్పారు. 

More Telugu News