haragopal: విద్యా పోరాట యాత్రలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్

  • సేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీ
  • కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారంటూ నిరసన
  • హరగోపాల్, చుక్కా రామయ్యల అరెస్ట్

  సేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను తీసుకెళ్లి, గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయతో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను కూడా అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కాపాడుకుందాం అనే నినాదంతో తెలంగాణ విద్యా పోరాట, పరిరక్షణ కమిటీ వంద రోజుల విద్యా పోరాట యాత్రను ప్రారంభించింది. గన్ పార్క్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో హరగోపాల్, చుక్కా రామయ్యలతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, మద్దతుదారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానంటూ అధికారపగ్గాలు చేపట్టిన కేసీఆర్... విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వ విద్య పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా యాత్రను అడ్డుకున్న పోలీసులు హరగోపాల్, చుక్కా రామయ్యలతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. 

More Telugu News