Chandrababu: 24 గంటల్లో కేసు వెనక్కి తీసుకోకపోతే.. ప్రజాగ్రహమే!: సోమిరెడ్డి హెచ్చరిక

  • ప్రజా ఉద్యమాలు చేస్తే వారెంట్ ఇస్తారా?
  • రాహుల్ సహా గిట్టని వారందరికీ నోటీసులు ఇస్తున్నారు
  • తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే నోటీసులు

బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన జరిపిన ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు ఇవ్వడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మేలు కోసం ప్రజా ఉద్యమాలు చేస్తే... వారెంట్ ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా తనకు గిట్టని వారందరికీ మోదీ ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. 24 గంటల్లో కేసును వాపసు తీసుకోవాలని... లేకపోతే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని సోమిరెడ్డి హెచ్చరించారు.

తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే చంద్రబాబుకు వారెంట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రేపు సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టు మోదీ చేస్తున్నారంటూ విమర్శించారు.

More Telugu News