Maharashtra: మహారాష్ట్ర పోలీసుల వ్యవహారశైలితో ఆనాడు చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు!: నామా నాగేశ్వరరావు

  • తెలంగాణ ఏడారి కాకూడదనే పోరాడాం
  • 80 మందిని కాలేజీ గదిలో బంధించారు
  • శవాల వ్యాన్లలో మమ్మల్ని తరలించారు

మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు కట్టడం కారణంగా తెలంగాణ ఎడారి అయిపోతుందన్న ఆవేదనతోనే టీడీపీ ఆందోళనకు దిగిందని ఆ పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ఓ పక్క తాము బాబ్లీ కట్టడం లేదని చెబుతూ, మరోవైపు శరవేగంగా దాన్ని మహారాష్ట్ర పూర్తి చేసిందని తెలిపారు. దీంతో తామంతా కలసి ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లామన్నారు. ఈ రోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహారాష్ట్రలోకి తాము ప్రవేశించకముందే తెలంగాణలో ఉండగానే బోర్డర్ కు వేలాది మంది పోలీసులు చేరుకున్నారని తెలిపారు. అక్కడి నుంచి తమను బలవంతంగా లాక్కునిపోయారని తెలిపారు. అక్కడ సమీపంలోని ఓ కాలేజీలో చిన్నగదిలో 80 మందిని బంధించారని చెప్పారు. తమతో 10 మంది మహిళా నేతలు ఉన్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. అక్కడకు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చల్లగా చెప్పారన్నారు.

ఆ రాత్రంతా తాము నరకం అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిమీద ఒకరు పడుకున్నామనీ, కనీసం మంచి నీళ్లు, బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పించలేదని అన్నారు. తమను బంధించిన ఆ కాలేజీ గదిని జైలుగా మార్చేశారని నాగేశ్వరరావు చెప్పారు. కనీసం పరిశుభ్రత కూడా లేకపోవడంతో టీడీపీ మహిళా నేతలే ఈ గది అంతటిని శుభ్రం చేశారన్నారు.

‘మేము ఇక్కడికి గొడవలకు రాలేదు, గొడవలు చేయలేదు. ఓ భారతీయ పౌరుడిగా నేను ఇక్కడికి బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు నా పార్టీ నేతలతో కలసి వచ్చా’ అని చంద్రబాబు చెప్పినా ఎవ్వరూ వినలేదని వాపోయారు. మూడో రోజు రాత్రిపూట శవాలను తరలించే రెండు వ్యాన్లలో 80 మంది టీడీపీ నేతలను కుక్కారన్నారు.

వ్యాన్లలో ఎక్కించిన అనంతరం వాటికి బయటి నుంచి తాళం వేసి పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహారశైలితో టీడీపీ నేతలు ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ‘మీరు ఎక్కడి తీసుకెళ్లినా వస్తాం, కానీ మమ్మల్ని పద్ధతిగా తీసుకెళ్లండి’ అని ఆయన వారికి చెప్పారన్నారు. అప్పట్లో ముగ్గురు టీడీపీ నేతల ఆరోగ్యం చెడిపోవడంతో అక్కడే సెలైన్స్ ఎక్కించాల్సి వచ్చిందని తెలిపారు.

More Telugu News