Purandshwari: బాబుకు నోటీసులకు, బీజేపీకి సంబంధం లేదు: తేల్చి చెప్పిన పురందేశ్వరి

  • 2010 నాటి కేసులో బీజేపీపై నిందలా?
  • సందేహాలుంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి
  • పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడివున్నాం
  • బీజేపీ మహిళా నేత పురందేశ్వరి

బాబ్లీ కేసులో ధర్మపురి న్యాయస్థానం చంద్రబాబుకు పంపిన నాన్ బెయిలబుల్ నోటీసులకు, బీజేపీకి ఎటువంటి సంబంధమూ లేదని ఆ పార్టీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి తేల్చి చెప్పారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, 2010 నాటి కేసుకు సంబంధించి బీజేపీపై ఎలా నిందలు వేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.

ఈ అంశంపై ఏమైనా సందేహాలుంటే, మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలని సూచించిన ఆమె, ఏం జరిగినా కేంద్రానికి ఆపాదించడాన్ని టీడీపీ తన నైజంగా మార్చుకుందని మండిపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని గుర్తు చేసిన ఆమె, దాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడివున్నామని వెల్లడించారు. ఏపీకి నిధుల కేటాయింపులో ఎన్నడూ అన్యాయం జరగలేదని, కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా డబ్బు విడుదలలో జాప్యం జరిగి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

More Telugu News