Bandla Ganesh: అధిష్ఠానం పోటీ చేయమంటే చేయడానికి నేను సిద్ధం!: ఢిల్లీలో బండ్ల గణేష్

  • ఎన్నికల తరువాత అధికారం కాంగ్రెస్ దే
  • అసెంబ్లీకి పోటీ చేసే విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం
  • తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న బండ్ల గణేష్

త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్, అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరడం, అదికూడా రాహుల్ సమక్షంలో చేరడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించిన ఆయన, తాను అసెంబ్లీకి పోటీ పడే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తెలిపారు. పార్టీ పోటీ చేయమంటే పోటీ చేసేందుకు తాను సిద్ధమని, లేకుంటే లేదని చెప్పారు. త్యాగాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణను ఇచ్చింది కూడా ఆ పార్టీయేనని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తప్పకుండా దేశ ప్రధాని అవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

తనకు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమని, రాజకీయాల్లోకి రావాలని భావించిన తరువాత, ఇదే సరైన సమయమని భావించానని అన్నారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన బండ్ల గణేష్, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, తాను ఇవాళ వచ్చిన పిల్లాడివంటి వాడినని, నాయకులు ఏది చెబితే అది చేస్తానని అన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ ఎన్నడూ మరువబోదని, పదవులు వాటంతట అవే వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

More Telugu News