Babli: చంద్రబాబు రాకుంటే అరెస్ట్ చేసి తెస్తాం: నాందేడ్ ఎస్పీ కతార్

  • ఐదు సంవత్సరాల క్రితమే చార్జ్ షీట్ దాఖలు
  • ఆ ప్రతులను నిందితులకు పంపించాం
  • నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కోర్టు పరిధిలోని అంశం
  • విచారణకు రాకుంటే అరెస్ట్ తప్పదన్న ఎస్పీ

బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘర్షణలపై నిందితులను ఎనిమిదేళ్ల నుంచి విచారించలేదని వస్తున్న ఆరోపణలపై నాందేడ్ ఎస్పీ కతార్ స్పందించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తాము ఐదేళ్లకు పూర్వమే చార్జిషీట్ దాఖలు చేశామని, ఆ ప్రతులను నిందితులుగా పేర్కొన్న అందరికీ పంపించామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నారన్న ఆరోపణలు వారిపై నమోదయ్యాయని, అప్పటి వీడియోలు, ఫొటోలు సాక్ష్యాలుగా ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. 16 మందిపై చార్జ్ షీట్ దాఖలైందని, కేసులో అభియోగాలు నమోదు చేశాక, విచారణ ఆసాంతం కోర్టు పరిధిలోనే ఉంటుందని గుర్తు చేశారు.

వారిని ఎప్పుడు విచారణకు పిలవాలన్న విషయం కోర్టు చూసుకుంటుందని, వారు రాకుంటే, కోర్టు నుంచి ఆదేశాలు అందిన తరువాత తాము అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామని చెప్పారు. చంద్రబాబు సహా 16 మంది నిందితులను 21వ తేదీలోపు కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు నుంచి తమకు ఆదేశాలు అందాయని, ఆలోగా నిందితులు వచ్చి హాజరవుతారనే భావిస్తున్నామని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం కోర్టు విచక్షణాధికారమని చెప్పిన ఆయన, చంద్రబాబు సహా ఇతర నిందితులు కోర్టుకు రాకుంటే, న్యాయ నిపుణుల సలహా తీసుకుని, వారిని అరెస్ట్ చేసి తరలిస్తామని చెప్పారు.

More Telugu News