kondagattu: విరిగిన స్టీరింగ్.. ఫిట్ నెస్ కూడా డొల్లే.. కొండగట్టు ప్రమాద విచారణలో సంచలన విషయాలు!

  • గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లిన బస్సు
  • ఫిట్ నెస్ ను పట్టించుకోని అధికారులు
  • బయటకు దూకేయమని అరిచిన డ్రైవర్

జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో జరిగిన ప్రమాదంలో ఈ రోజు ఉదయం వరకూ 61 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయమై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ బస్సుకు అస్సలు ఫిట్ నెస్ లేదని ఈ ఘటనపై విచారణ జరుపుతున్న అధికారులు తేల్చారు. దీని కారణంగానే బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. వేగం అదుపులోకి రాకపోవడంతో స్పీడ్ బ్రేకర్లను దాటుకుంటూ వాహనం వేగంగా లోయలోకి పడిపోయిందని వెల్లడించారు.

బస్సు అదుపు తప్పగానే స్టీరింగ్ విరిగిపోయిందనీ, దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ విషయమై కండక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ.. వాహనానికి ఫిట్ నెస్ లేదని చెప్పినా డిపో అధికారులు పట్టించుకోలేదని వెల్లడించారు. స్పీడ్ బ్రేకర్లు దాటాక గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లిన బస్సు లోయలో పడిపోయిందని తెలిపారు.

ఈ సందర్భంగా బస్సు నుంచి అందరూ దూకేయాలని డ్రైవర్ గట్టిగా అరిచాడన్నారు. ఈ మార్గంలో మరో బస్సు లేకపోవడంతో 100 మందికి పైగా బస్సులో ఎక్కారన్నారు. ప్రమాదం జరగగానే తాను స్పృహ కోల్పోయానని చెప్పాడు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో శనివారంపేట, డబ్బు తిమ్మయ్యపల్లి, రాంసాగర్‌, తిర్మలాపూర్‌, హిమ్మత్‌రావుపేట, కోనాపూర్‌, సండ్రపల్లి గ్రామాలకు చెందిన వారే 50మంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ ఓ గర్భిణి ఈ రోజు ఉదయం జగిత్యాలలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడంతో మొత్తం చనిపోయినవారి సంఖ్య 61కి చేరుకుంది.

More Telugu News