Police: రాజన్న జిల్లాలో పోలీస్ జులుం.. ఫైన్ కడతానని చెబుతున్నా వినిపించుకోకుండా వ్యక్తిపై దాడి!

  • నో పార్కింగ్ జోన్ లో వాహనాన్ని ఆపిన రామారావు
  • ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్సై
  • బాధితుడిని మెడపట్టి జీప్ లో పడేసిన పోలీసులు

పోలీస్ శాఖపై ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేపట్టాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నప్పటికీ కొందరు పోలీసులు మాత్రం మారడం లేదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనారావుపేటలో నో పార్కింగ్ జోన్ లో కారును పార్క్ చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. తాను తప్పు చేశాననీ, దానికి జరిమానా కడతానని చెబుతున్నా వినిపించుకోకుండా సదరు వ్యక్తిని కారు నుంచి బయటకు లాగిపడేశారు. అనంతరం కొట్టుకుంటూ పోలీస్ జీప్ ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న స్థానికులు కొందరు ఈ దృశ్యాలను ఫోన్లలో రికార్డు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కోనారావుపేటకు చెందిన రామారావు తన కారును నో పార్కింగ్ జోన్ లో ఆపాడు. దీంతో అటుగా వచ్చిన స్థానిక ఎస్సై ఇది చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిని జీప్ ఎక్కించాలని ఆదేశించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని కారు నుంచి బయటకు లాగడం మొదలు పెట్టారు. తాను ఎక్కడికీ పారిపోననీ, జరిమానా కడతానని చెబుతున్నా వినిపించుకోలేదు. చివరకు అతడిని మెడపట్టి బయటకు లాగి పోలీస్ జీప్ లోకి తోసేశారు. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News