Hyderabad: 7 తలలు, 7 పాములు, 57 అడుగులు... ఖైరతాబాద్ మహా గణపతి విశేషాలు!

  • ఖైరతాబాద్ లో కొలువుదీరిన సప్తముఖ కాళ సర్ప గణపతి
  • నయనానందకరంగా తీర్చిదిద్దిన శిల్పి రాజేంద్రన్
  • భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

హైదరాబాద్ లో గణేష్ చతుర్థి పేరు చెబితే తొలుత గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ లో కొలువుదీరే మహాగణపతే అన్న సంగతి విదితమే. ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ కూడలిలో భారీ గణేశుడు కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో నయన మనోహరంగా ఈ విగ్రహం తీర్చిదిద్దబడింది.

57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పులో ఉన్న విగ్రహాన్ని 'సప్తముఖ కాళ సర్ప గణపతి' గా తయారు చేశారు. 7 తలలు, ఆ తలలపై 7 సర్పాలతో స్వామి కనువిందు చేస్తుండగా, 14 చేతుల్లో 14 రకాల ఆయుధాలను ఉంచారు. కుడివైపున శ్రీనివాసకల్యాణం, ఎడమవైపున శివ పార్వతుల విగ్రహాలను ఉంచారు. ఇక స్వామికి మహా ప్రసాదంగా 50 కిలోల లడ్డూను శిల్పి రాజేంద్రన్ సమర్పించారు.

నిన్న ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి వస్తుండగా, పరిపూర్ణానంద, నాయిని నరసింహారెడ్డి తొలి పూజలు నిర్వహించారు. గత సంవత్సరంతో పోలిస్తే, మరింతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విగ్రహం వద్దకు ఏ వైపు నుంచి వెళ్లినా, మెటల్ డిటెక్టర్ల మధ్యగానే వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

More Telugu News