Salman Khan: నటుడు సల్మాన్‌ఖాన్‌పై కేసు పెట్టండి.. ఆదేశించిన బీహార్ కోర్టు

  • సల్మాన్ సొంత బ్యానర్‌పై ‘లవ్ రాత్రి’ సినిమా
  • హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్న పిటిషన్‌దారు
  • నవరాత్రుల సమయంలోనే సినిమా విడుదల

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా బీహార్ కోర్టు ఆదేశించింది. సల్మాన్ సొంత బ్యానర్‌‌లో నిర్మించిన ‘లవ్‌రాత్రి’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా పేరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు స్థానిక న్యాయవాది సుధీర్ ఓఝా కోర్టులో వేసిన పిటిషన్‌ను ముజఫర్‌పూర్ సబ్ డివిజనల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ శైలేంద్ర బుధవారం విచారించారు. సుధీర్ వాదనను విన్న మేజిస్ట్రేట్ సల్మాన్ ఖాన్, ఆయన బావమరిది ఆయుశ్ శర్మలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా మీథన్‌పూర్ పోలీసులను ఆదేశించారు. ఈ సినిమాలో సల్మాన్, ఆయుశ్ శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, నటి వరీనా హుస్సేన్ కథానాయికగా నటిస్తోంది.

సెప్టెంబరు 6న ఓజా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ‘లవ్‌రాత్రి’ పేరు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. దసరా ఉత్సవాలప్పుడు జరుపుకునే ‘నవరాత్రి’ని ఇది ప్రతిబింబిస్తోందని, అసభ్యతను ప్రోత్సహిస్తోందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  అంతేకాక, ఈ సినిమా కూడా నవరాత్రుల ప్రారంభానికి ముందు అక్టోబరు 5న విడుదల కాబోతోందని ఓఝా వివరించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు సల్మాన్, ఆయుశ్ శర్మలపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది.

More Telugu News