Uttam Kumar Reddy: చంద్రబాబు, ఉత్తమ్ ల కలయిక జుగుప్సాకరం.. నాకైతే సంతోషంగానే ఉంది: కేటీఆర్

  • తెలంగాణకు అడ్డుపడ్డ రెండు పార్టీలు ఏకమయ్యాయి
  • రెండు పార్టీలను ఒకే దెబ్బతో చిత్తు చేసే అవకాశం దొరికింది
  • ఎన్నికలంటేనే కాంగ్రెస్ భయపడుతోంది

తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డ కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిల కలయిక జుగుప్సాకరమని విమర్శించారు. అయితే ఈ కలయిక తనకు సంతోషాన్ని కలిగిస్తోందని... ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో తెలంగాణ ప్రజలకు క్లియర్ ఛాయిస్ లభించిందని చెప్పారు. రెండు పార్టీలను ఒకే దెబ్బతో చిత్తు చేసే అవకాశం దొరికిందని అన్నారు. ఓ స్పష్టమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందు ఉందని తెలిపారు. టీఆర్ఎస్ కావాలో, తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీలు కావాలో నిర్ణయించాల్సిన సమయం ఇది అని చెప్పారు. ఈ రోజు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.

సురేష్ రెడ్డిలాంటి పెద్దలు టీఆర్ఎస్ లో చేరడం సంతోషకరమని కేటీఆర్ చెప్పారు. కొండగట్టు ప్రమాదానికి సంబంధించిన విషాదంతోపాటు, కొంత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని సాధారణంగా ప్రతిపక్షాలు ఎదురు చూస్తుంటాయని... కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలంటేనే భయపడుతోందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదులో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని చెప్పారు.

More Telugu News