Chandrababu: జీవితంలో మరచిపోలేని క్షణం.. గొప్ప అనుభూతిని కలిగించింది: చంద్రబాబు

  • నేనే శంకుస్థాపన చేశా.. నేనే గ్యాలరీ వాక్ చేశా
  • అతి త్వరగా పూర్తయిన ప్రాజెక్టుగా పోలవరం చరిత్రలో నిలిచి పోతుంది
  • 57 ప్రాజెక్టులు పూర్తైతే.. అన్ని చెరువులకు నీరు ఇవ్వచ్చు

పోలవరం ప్రాజెక్టును నిర్మించే అవకాశం తనకు దక్కడం తన సుకృతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిర్ణీత సమయంలోగానే పోలవరంను పూర్తి చేసి తీరతామని చెప్పారు. ఈరోజు పోలవరం గ్యాలరీ వాక్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్యాలరీ మొత్తం తాను నడిచానని, ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని చెప్పారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని క్షణమని అన్నారు. దీనికి తానే శంకుస్థాపన చేశానని, తానే గ్యాలరీ వాక్ చేశానని... ఇది అత్యంత అరుదైన ఘటన అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కలిగించినా... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగదని తెలిపారు. సవరించిన అంచనాల ఆమోదం కోసం మంత్రులు, అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు.

ప్రతిపక్షాలు చేసే రాజకీయ విమర్శలను తాము పట్టించుకోమని... మంచి సూచనలు ఇస్తే మాత్రం లోపాలను సరిదిద్దుకుంటామని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షాలకు రాజకీయాలు కావాలని, తనకు మాత్రం రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పారు. మే లోపు ప్రాజెక్టును పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీటిని తీసుకెళ్తామని తెలిపారు. ప్రాజెక్టుకు ఆటంకాలు కలగకుండా ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపించానని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని తెలిపారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రాజెక్టుపై సమీక్ష జరుపుతున్నానని చెప్పారు.

ఇప్పటి వరకు 27 సార్లు పోలవరంను సందర్శించి పనులను పరిశీలించానని చంద్రబాబు తెలిపారు. పోలవరం కుడి కాలువ పనులు 90 శాతం, ఎడమ కాలువ పనులు 63.58 శాతం పూర్తయ్యాయని చెప్పారు. అతి త్వరగా పూర్తయిన ప్రాజెక్టుగా పోలవరం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే... ఇప్పటికే పనులు  పూర్తయ్యేవని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా జలదీక్ష తీసుకున్నానని చెప్పారు. నీరు-ప్రగతి పథకం కింద ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానని తెలిపారు. 57 ప్రాజెక్టులు పూర్తయితే... రాష్ట్రంలోని అన్ని చెరువులకు నీరు ఇవ్వచ్చని చెప్పారు. 

More Telugu News