KONDAGATTU: కొండగట్టు బస్సు ప్రమాదం.. వాహనంలో 101 మంది ప్రయాణికులు?

  • లోయలోకి దూసుకెళ్లిన బస్సు
  • ఒకే గ్రామానికి చెందిన 13 మంది మృతి
  • ప్రమాదాలకు టార్గెట్లే కారణమంటున్న డ్రైవర్లు

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయం ఘాట్ రోడ్డులో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్ సహా 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో శనివారం పేట గ్రామానికి చెందిన 13 మంది మృతి చెందారు. దీంతో ఈ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

అయితే ఈ ఘటనపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ఉన్నట్లు తొలుత భావించినప్పటికీ మొత్తం 101 మంది వెళుతున్నట్లు తేలింది. ఈ విషయమై స్థానికులు మాట్లాడుతూ ఆర్టీసీ తమ గ్రామాలకు తగినన్ని సర్వీసులను కేటాయించడం లేదని ఆరోపించారు. ఈ రూట్ లో ఒకే బస్సు తిరుగుతోందని వెల్లడించారు. అది కూడా రోజుకు ఆరు ట్రిప్పులకు మించి రాదని చెప్పారు. మరో మార్గం లేకపోవడంతో తామంతా దీన్నే ఎక్కాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

కొండగట్టు యాక్సిడెంట్ లో చనిపోయిన డ్రైవర్ శ్రీనివాస్ ఈ ఏడాది ఉత్తమ డ్రైవర్ అవార్డును అందుకున్నాడని ఆయన తోటి ఉద్యోగులు తెలిపారు. సెలవులు లేకుండా ఓవర్ డ్యూటీ చేయించడం కారణంగా తామంతా తీవ్రంగా అలసిపోతున్నామనీ, కనీసం రాత్రిపూట నిద్రపోయే సౌకర్యం కూడా తమకు ఉండదని వెల్లడించారు. ఉన్నతాధికారులు టార్గెట్లు పెట్టడం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆర్టీసీ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారని వాపోయారు. కొండగట్టు ప్రమాదంలో శనివారం పేటతో పాటు రామసాగర్, హిమ్మత్ రావు పేట, డబ్బు తిమ్మయ్యపల్లి, తిరుమలాపూర్, సండ్రలపల్లి, ముత్యం పేట తదితర గ్రామాలకు చెందిన 58 మంది దుర్మరణం చెందారు.

More Telugu News