raghuram rajan: మోసగాళ్ల వివరాలు ప్రధానికి పంపాను.. ఫలితం లేదు!: రఘురాం రాజన్ తీవ్ర విమర్శలు

  • పార్లమెంటరీ ప్యానెల్‌కు నివేదిక ఇచ్చిన రాజన్
  • ప్రధానికి మోసగాళ్ల జాబితా పంపానన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ 
  • మోసగాళ్లను పట్టుకోలేకపోవడం వ్యవస్థ వైఫల్యంగా అభివర్ణన

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, పెను సంచలనం సృష్టించారు. కొందరు ప్రముఖుల మోసాల తీరును వివరిస్తూ ఓ జాబితాను ప్రధాని కార్యాలయానికి అప్పట్లో తాను గవర్నర్ గా వున్న సమయంలో పంపానని, అయినా ఫలితం లేదని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజన్ ఆరోపించారు. బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్‌కు రాజన్ ఓ నివేదికను ఇచ్చారు. ఇందులో ప్రభుత్వంపై ఈ ఆరోపణలు గుప్పించారు.  

తన హయాంలోనే మోసాల పర్యవేక్షణకు ఓ సెల్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీని ద్వారానే ప్రముఖుల మోసాల జాబితాను పంపించానని వెల్లడించారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదన్నారు. మోసాలకు పాల్పడిన వారిని పట్టుకోలేకపోవడాన్ని వ్యవస్థ వైఫల్యంగా రాజన్ అభివర్ణించారు. ఆర్థిక వృద్ధి దూసుకెళుతున్న సమయంలోనే మొండి బకాయిలు కూడా పెరిగిపోయాయని ఆయన తెలిపారు.

రాజన్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు, విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి ఆయుధాల్లా ఉపయోగపడుతున్నాయి. ప్రధానిని, ఆయన కార్యాలయాన్ని ఏకంగా ఆర్బీఐ మాజీ గవర్నరే తప్పుబట్టారని, ఇంతకు మించి ఏం కావాలని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

More Telugu News