bhuabaneswar: ఆ పోలీసు డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తాడు!

  • ఆ ట్రాఫిక్ పోలీసు పేరు ప్రతాప్ చంద్ర ఖండ్వాల్
  • ట్రాఫిక్ కంట్రోల్ కు వినూత్న ఆలోచన
  • ‘స్టాప్’ అనాలన్నా.. ‘ప్రొసీడ్’ చెప్పాలన్న డ్యాన్సే చేస్తాడు!

సిగ్నల్ లైట్స్ ను అనుసరించి వాహనదారులు ముందుకు వెళ్లడమో, ఆగడమో జరుగుతుంది. కానీ, భువనేశ్వర్ లో ట్రాఫిక్ పోలీసుగా ప్రతాప్ చంద్ర ఖండ్వాల్ విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో అలా కుదరదు. ఎందుకంటే, ఈ పోలీసు డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తాడు కనుక.

డ్యాన్స్ కు.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి సంబంధమేమిటంటే.. ప్రతాప్ చంద్ర గతంలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. ఇటీవలే ట్రాఫిక్ పోలీసుగా నియమితుడయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడమంటే చిన్న విషయం కాదు. అందుకే, ట్రాఫిక్ పోలీసుగా కొత్తగా విధుల్లో చేరిన ప్రతాప్ చంద్రకు చుక్కలు కనపడ్డాయి. ట్రాఫిక్ పోలీసుగా తాను చేసే సూచనలను వాహనదారులు పట్టించుకున్న పాపాన పోలేదట.

దీంతో కొంత మేరకు ప్రతాప్ చంద్ర చికాకు చెందినప్పటికీ, ఓ వినూత్న ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఫలితమే డ్యాన్స్ తో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం. నడిరోడ్డు మధ్యలో నిలబడే ప్రతాప్ చంద్ర.. ‘స్టాప్’ చెప్పాలంటే ఓ భంగిమలోను, ప్రొసీడ్ అవమని చెప్పడానికి మరో భంగిమలోను వాహనదారులకు సూచనలు చేస్తాడు. అతను ఇలా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం వాహనదారులకు నచ్చడంతో.. దానిని ఎంజాయ్ చేస్తూ, చక్కగా పాటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో ప్రతాప్ చంద్రపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

More Telugu News