Kondagattu: కొండగట్టులోని ఈ రోడ్డుపై బస్సులు తిరగవు.. ఎందుకు అనుమతించారో కనుక్కుంటాం!: మంత్రి ఈటల

  • ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
  • చికిత్స ఖర్చును భరించనున్న ప్రభుత్వం
  • బస్సును డ్రైవర్ కార్నర్ కు తీసుకొచ్చాడన్నఈటల

జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కొండపై నుంచి కిందకు దిగుతున్న బస్సు లోయలో పడిపోయి తుక్కుతుక్కయింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల స్పందించారు.

ప్రమాదం జరిగిన వెంటనే జగిత్యాల కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించాలని జిల్లాలోని అన్ని ఆసుపత్రులను ఆదేశించామన్నారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మార్గంలో సాధారణంగా బస్సులు తిరగవని రాజేందర్ తెలిపారు. ఈ ప్రమాదకరమైన ఘాట్ లో బస్సులను ఎందుకు నడిపారో తెలుసుకుంటామని వ్యాఖ్యానించారు. మరికొద్ది సేపట్లో తాను ప్రమాదస్థలికి వెళతానని రాజేందర్ అన్నారు. రోడ్డు పెద్దదిగా ఉన్నా డ్రైవర్ కార్నర్ కు వచ్చాడని తెలిసిందని, అందువల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారని ఆయన అన్నారు.

More Telugu News