Aamir Khan: సౌండ్ ఇంజనీర్ ప్రాణాలు కాపాడిన ఆమిర్ ఖాన్!

  • సౌండ్ ఇంజనీర్ షాజిత్ కు అస్వస్థత
  • పట్టించుకోని లీలావతి ఆసుపత్రి
  • ఫోన్ చేయగానే స్పందించిన ఆమిర్

ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటాడు. తన పానీ ఫౌండేషన్ తో వందలాది గ్రామాలకు నీరు అందించేందుకు ఆమిర్ కృషి చేస్తున్నాడు. తాజాగా ఆమిర్ కారణంగానే తన సోదరుడు బతికాడని సౌండ్ ఇంజనీర్ షాజిత్ కోయర్ సోదరి తెలిపింది. ఆమిర్ లేకుంటే తన సోదరుడు తమకు దక్కేవాడే కాదని వ్యాఖ్యానించింది.

ఇటీవల దేశవిదేశాల్లో రూ.2,000 కోట్లు వసూలుచేసిన ఆమిర్ ఖాన్ సినిమా ‘దంగల్’కు షాజిత్ కోయర్(44) సౌండ్ ఇంజనీర్ గా పనిచేశాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కోయర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఇటీవల ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడే కోయర్ కు గుండెపోటు కూడా వచ్చింది. ఈ సమయంలో ఆసుపత్రిలో వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో భయపడ్డ కుటుంబ సభ్యులు వెంటనే ఆమిర్ ఖాన్ కు ఫోన్ చేశారు.

ఈ కాల్ కు వెంటనే స్పందించిన ఆమిర్.. కోయర్ ను ముంబైలోనే ఉన్న కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యమైన అంబానీ కుటుంబీకులతోనూ ఆమిర్ మాట్లాడాడు. దీంతో ఆసుపత్రికి చేరుకున్న కోయర్ కు వైద్యులు వేగంగా వైద్యం ప్రారంభించి ప్రాణాలు కాపాడగలిగారు. ఈ నేపథ్యంలో ఆమిర్ స్పందించకుంటే కోయర్ ప్రాణాలు దక్కేవి కావని అతని సోదరి మీడియాకు తెలిపింది. ఆమిర్ కు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపింది. లీలావతి ఆసుపత్రి యాజమాన్యం తన సోదరుడి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను లీలావతి ఆసుపత్రి యాజమాన్యం తిరస్కరించింది.

2006లో విడుదలైన ‘ఓంకార’  చిత్రానికి బెస్ట్ సౌండ్ ఇంజనీర్ గా కోయర్ జాతీయ అవార్డు అందుకున్నారు. రెండు ఫిల్మ్‌ఫేర్‌, రెండు ఐఫా అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 

More Telugu News