Congress: బంద్‌కు సర్వం సిద్ధం.. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం!

  • బంద్‌లో పాల్గొననున్న 21 పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు
  • ఉదయం 9 గంటల నుంచి 3 వరకు బంద్
  • బంద్‌లో అవాంఛనీయ ఘటనలకు చోటు లేదన్న కాంగ్రెస్

పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన బంద్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది.  కాంగ్రెస్ బంద్ పిలుపునకు మిగతా విపక్షాలు కూడా స్పందించాయి. డీఎంకే, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, జేడీఎస్ సహా మొత్తం 21 ప్రధాన పార్టీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం కూడా బంద్‌లో పాల్గొంటున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటలకు బంద్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ వేళలు నిర్ణయించినట్టు వివరించింది. కాగా, వామపక్షాలు మాత్రం విడిగా బంద్‌కు పిలుపునిచ్చాయి. తాము కూడా నిరసనల్లో పాల్గొంటామని తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది.

బంద్ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. బంద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటులేదని, అటువంటివి జరగకుండా చూడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వంటి అంశాలను చర్చించకపోవడం బాధాకరమన్నారు.

More Telugu News